ఖాన్ త్రయంలో.. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. ఇప్పటికీ రెండు పెండ్లిళ్లు పెటాకులయ్యాయి. ఇప్పుడు 60 యేట పుట్టినరోజు సందర్భంగా తాను డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశాడు.
అమీర్‌ఖాన్ డిఫరెంట్ సినిమాలతో అలరిస్తూ ఎన్నో సూపర్‌హిట్ మూవీలను బాలీవుడ్‌కి అందించాడు. మార్చి 14తో 60వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అన్ని ఇండస్ట్రీల నుంచి చాలామంది ప్రముఖులు తనకి శుభాకాంక్షలు తెలియచేశారు. అయితే ఇందులో ఏముందని అనుకునేరు. బర్త్ డే రోజు అమీర్ ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో తను ఏడాదిన్నరగా డేటింగ్ చేసే అమ్మాయి గౌరీ స్ప్రాట్ అని ప్రకటించాడు. అంతేకాదు.. ఇందులో ఇంకో ట్విస్ కూడా ఉంది. ఆమెతో కలిసి సాయంత్రం కేక్ కట్ చేసి అందరికీ ఆమెను పరిచయం చేశారు.

ఎవరీ గౌరీ..?
అభిమానులకే కాదు.. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కూడా ఆమె ఎవరు అని ఆరాలు తీస్తున్నారు. అసలు ఆమెకు పెళ్లయిందా? ఏం చేస్తుంటుంది అంటూ తెగ వెతికేస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రి ఆమె పేరు సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ గౌరీ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. గౌరీ తల్లి రీటా స్ప్రాట్ ఒక స్టైలిస్ట్. తండ్రి ఐరిష్. బ్లూ మౌంటెన్ స్కూల్‌లో 1996లో ఫ్యాషన్ కోర్సు చేసింది. ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీని లండన్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఆ తర్వాత బొటిక్స్‌కి డిజైనర్, బయ్యర్‌గా పని చేసింది. ప్రస్తుతం స్ప్రాట్ హెయిర్ డ్రెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
గౌరీకి ఇంతకుముందే పెళ్లయింది. ఆరేండ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్తతో కలిసి విడిపోయి ప్రస్తుతం కొడుకుతో కలిసి ఉంటుంది. కిరణ్‌రావుతో బంధం విడిపోయాక అమీర్ గౌరీని కలిసినట్లు తెలుస్తున్నది. కాకపోతే వీరి మధ్య స్నేహబంధం 18 యేండ్ల నుంచి ఉంది. అయితే అమీర్ చెప్పేవరకు ఈ డేటింగ్ విషయం తెలియకపోవడానికి కారణం ఆమె బెంగళూరులో ఉండడమే. తనని కలుసుకోవడానికి అమీర్ బెంగళూరు వెళ్లేవాడట. అక్కడ తన పై మీడియా అటెన్షన్ తక్కువ ఉండడం వల్ల వారి ప్రేమ విషయం తెలియలేదని అమీర్ అన్నాడు. పైగా గౌరీ హిందీ సినిమాలు ఎక్కువ చూడదని, తన పాటలంటే ఇష్టమని కూడా అమీర్ ఈ సందర్భంగా తెలియచేశాడు. రెండు పెండ్లిళ్లు అయి విడిపోయిన అమీర్ మరి గౌరీతో బంధం ఎలా ఉంటుందోనని సోషల్ మీడియాల్లో చర్చలు సాగుతున్నాయి.