ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఘనత సాధించింది రెమోనా ఎవెట్ పెరీరా. 170 గంటల పాటు అద్భుతమైన భరతనాట్య ప్రదర్శనతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
మంగళూరులోని సెయింట్ అలోసియసిస్ చివరి సంవత్సరం బి.ఎ. చదువుతున్నది రెమోనా. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇందులోనే ఏదైనా గొప్పగా సాధించాలనుకుంది. అందుకే జూలై 21న ప్రారంభమైన ఈ అసాధారణ మారథాన్ ఒక వారం తర్వాత జూలై 28న ముగిసింది. దీనిని చూడడానికి పలువురు విచ్చేశారు. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం నిరంతరం భరతనాట్యం ప్రదర్శించిన మొదటి వ్యక్తిగా పెరీరా నిలిచింది.

యూనివర్సిటీలోని రంగ అధ్యయన కేంద్రం డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పెరీరాకు ప్రతి మూడు గంటలకు 15 నిమిషాల విరామం మాత్రమే అనుమతించబడింది. అయినప్పటికీ ఆమె శక్తి, స్ఫూర్తి ఎప్పుడూ తగ్గలేదని అన్నారు. ఆ కాస్త సమయం లేకుండా నిర్విరామంగా చేయాలనేది ఆమె కోరిక. అది కూడా త్వరలో సాధించాలనే పట్టుదలతో ఉంది. రెమోనా భరతనాట్య ప్రయాణం ఆమెకు మూడేళ్ల వయసులో గురువు శ్రీవిద్య మురళీధర్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సంవత్సరాల క్రమశిక్షణ, అభిరుచి 2019లో ఆమె రంగప్రవేశానికి దారితీసింది. ఇది ఆమె మొదటి ప్రధాన సోలో ప్రదర్శన. ఇప్పుడు ఈ చారిత్రాత్మక మైలురాయి.
ఆమె ప్రదర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అనేక ఖాతాలు వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశాయి. చాలామంది రెమోనాని అభినందిస్తూ కామెంట్లు చేశారు. ఇది అరుదైన ఘనత అని అందరూ అభివర్ణించారు.