ఒంటె కన్నీటి చుక్క పాము విషాన్ని ఎదుర్కోగలదని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ ఎడారి అద్భుతం పాముకాటు వైద్యంలో ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదో తెలుసుకోండి.
ఒక కన్నీటి చుక్క ఎంతో ఖరీదు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాగే అదే కన్నీటి చుక్క ఇప్పుడు పాము విషానికి కూడా విరుగుడు అవుతుందని అంటే నమ్మకం కలుగడం లేదు కదా! కానీ నమ్మి తీరాలి. రాజస్థాన్‌లోని ఎడారి ఓడగా పిలిచే ఒంటె ఇప్పుడు అక్కడి రైతులకు రవాణా మార్గం కంటే కూడా ఎక్కువ ఉపయోగంలోకి వచ్చేసింది. బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కామెల్ (NRCC) చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఒంటె కన్నీళ్లు రోగనిరోధక వ్యవస్థల నుంచి తీసుకోబడిన ప్రతిరోధకాలు పాము విషాన్ని తటస్తం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు.. ఒంటె పెంపకం రైతుల ఆదాయాలను పెంచుతాయని వెల్లడించింది.

శాస్త్రీయ పురోగతి..
భారతదేశంలో ఏటా దాదాపు 58,000 పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి. మరో 140,000 వైకల్యం కేసులు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. NRCC పరిశోధకులు అత్యంత విషపూరితమైన పాము జాతి అయిన సా-స్కేల్డ్ వైపర్ (ఎచిస్ కారినాటస్ సోచురెకి) నుంచి విషంతో ఒంటెలకు (కామెలస్ డ్రోమెడారియస్) రోగనిరోధక శక్తిని ఇవ్వడం ద్వారా ప్రయోగాలు నిర్వహించారు. జంతువుల కన్నీళ్లు, రక్తం నుంచి సేకరించిన ప్రతిరోధకాలు విషం ప్రాణాంతక ప్రభావాలను – ముఖ్యంగా రక్తస్రావం, కోగులోపతిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయని కనుగొనబడింది. ముఖ్యంగా, ఈ ఒంటె-ఉత్పన్న ప్రతిరోధకాలు తక్కువ అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించాయి. గుర్రపు ఇమ్యునోగ్లోబులిన్ (IgG) నుంచి తీసుకోబడిన సాంప్రదాయ యాంటీవీనమ్‌లతో పోలిస్తే మరింత శక్తివంతమైనవి. ఇవి ఖరీదైనవి. ఉత్పత్తి చేయడానికి సంక్లిష్టమైనవి.
ఒక జీవనాధారం
ఈ పరిశోధన బికనీర్, జైసల్మేర్, జోధ్‌పూర్ వంటి ప్రాంతాలలో ఒంటెల పెంపకం వర్గాలకు ఆర్థికంగా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కన్నీళ్లు, రక్త నమూనాలను.. నియంత్రిత, సురక్షితమైన వెలికితీత కోసం స్థానిక రైతులు తమ ఒంటెలను అందించాలని NRCC ప్రోత్సహించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఔషధ తయారీదారులు సహా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇప్పుడు ఒంటె నుంచి పొందిన ప్రతిరోధకాలను కోరుతున్నాయి. అంచనాల ప్రకారం రైతులు నెలకు అదనంగా ₹5,000 నుండి ₹10,000 వరకు సంపాదిస్తారు.
