టేస్టీ అట్లాస్ ప్రపంచం నలుమూలల నుంచి రెసిపీలలో ది బెస్ట్ అనుకున్న 100 వంటకాలను సెలెక్ట్ చేశారు. అందులో భారతదేశం నుంచి నాలుగు వంటకాలు సెలెక్ట్ అయ్యాయి. అందులో మన హైదరాబాదీ బిర్యానీ కూడా ఉందండోయ్!
ఘుమఘుమలాడే వంటకాలు ప్రపంచ నలుమూలాల ఉండొచ్చు. కానీ భారతదేశం వంటకాల మసాలా ఘాటు మాత్రం ఇప్పుడు ప్రపంచాన్ని కూడా కట్టిపడేస్తుంది. అందుకే టెస్టీ అట్లాస్ 2025 బెస్ట్ డిషెస్ ఇన్ ద వరల్డ్ పేరుతో ఒక లిస్ట్‌ని విడుదల చేసింది. అందులో మన దేశం నుంచి నాలుగు ఉండడం ఇక్కడ విశేషం. ఆ నాలుగేంటో.. వాటి వివరాలేంటో చదువండి.

ముర్గ్ మఖని..
ఢిల్లీలో పుట్టిన ఈ వంటకంలో బటర్, టమాటా ప్యూరీ వాడుతారు. ఇంకా చెప్పాలంటే ఇది కాస్త చికెట్ టిక్కా మసాలా రెసిపీకి దగ్గరగా ఉంటుంది. 1950లో ఈ వంటకాన్ని దర్యాగంజ్ పరిసరాల్లోని మోతీ మహల్ రెస్టారెంట్‌లో ఈ కూరను అభివృద్ధి చేశారు. అంటే.. మిగిలిపోయిన టమాటా కూరలో చికెన్‌ని వేయడం వల్ల ఈ కూర రెడీ అయిందట. అయితే యాదృచ్ఛికంగా తయారైన ఈ వంటకం ఇప్పుడు ప్రపంచం నలుమూలాల ఆదరణ పొందుతున్నది. ఈ వంటకం 29వ స్థానంలో ఉంది.

హైదరాబాద్ బిర్యానీ
అసలు బిర్యానీ అనే పదం వినగానే చాలామంది నోట్లో నీళ్లురుతున్నట్టున్నాయి కదా! హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్ అన్నట్టుగా పేరు పడిపోయింది. 1630లో మొఘల్స్ హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిజాంలు పాలించారు. వీరి మిళితంలో నుంచి పుట్టినదే ఈ బిర్యానీ. 18వ శతాబ్దంలో నిజామ్ నవాబ్ నిజామ్-ఉల్-ముల్క్ పాలనలో అసఫ్ జా ఈ బిర్యానీని తయారుచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. మేక మాంసంతో ముందు ఈ బిర్యానీని తయారుచేసేవారు. ఆ తర్వాతి కాలంలో చాలా రకాల బిర్యానీలు పుట్టుకొచ్చాయి. ఈ వంటకం ఇప్పుడు లిస్ట్‌లో 31వ స్థానంలో నిలిచింది.

చికెన్ 65
టేస్టీ వంటకాల్లో 97స్థానంలో నిలిచింది.. చికెన్ 65. ఈ వంటకం మీద కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ చెన్నైకి చెందిన హోటల్ బుహారీ ఈ డిష్‌ని తయారు చేసినట్టుగా చెబుతారు. తొందరగా అయ్యే చికెన్ స్నాక్ లిస్ట్‌లో ఇది ప్రథమ స్థానం దక్కించుకుంటుంది. బోన్‌లెస్ చికెన్‌తో తయారు చేసే ఈ చికెన్ 65 మీద చాలా కథనాలున్నాయి. ఒకప్పుడు మిలిటరీలో ఇది సాధారణ భోజనం కింద పెట్టేవారంటారు. మరికొందరు చికెన్ వేయించిన తర్వాత 65 పచ్చిమిరపకాయలను వాడడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇంకొందరు.. 65రోజుల చికెన్‌తో ఈ వంటకం చేస్తారని, ఈ వంటకం కోసం 65 ముక్కలను ఉపయోగించి చేస్తారని అంటుంటారు.

కీమా
100వ స్థానంలో నిలిచిన వంటకం ఇది. మటన్ లేదా చికెన్‌ని చాలా చిన్న పీసులుగా కట్ చేస్తారు. ఉర్దూలో కీమా అంటే.. చిన్నగా మాంసం చేయడమని అర్థం. దానినే వంటకానికి పేరు పెట్టారు. భారతదేశంలోనే కాదు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఈ వంటకం చాలా ఫేమస్. అయితే ఈ వంటకం పార్శియన్స్ నుంచి వచ్చిందని అంటారు. కానీ అక్బర్ కాలం నుంచే ఉంది. ఒకప్పుడు పావ్ బన్స్, నాన్స్‌తో ఈ వంటకాన్ని సర్వ్ చేసేవారు. ఆ తర్వాత సమోసాల్లో, పరోటాల్లో కూడా కీమాని పెట్టేవారు. ఆ తర్వాత కాలంలో ఇదొక ప్రత్యేక వంటకంగా పేరు తెచ్చుకుంది.