ఇప్పటివరకు ఎన్నో రకాల జీన్స్‌లు చూశారు. ఇప్పుడు సరికొత్తగా ఒంటికాలి జీన్స్‌ని ప్రవేశ పెట్టింది ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ అయిన కోపర్ని. ఇప్పుడు ఈ జీన్స్ సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పిచ్చి పలు రకాలు అన్నట్లుగా.. జీన్స్ కూడా పలు రకాలే! ఈ రెండింటికీ పోలిక ఎందుకంటే.. ఇప్పటిదాకా చిరిగిన జీన్స్, బూట్ కట్ జీన్స్.. అబ్బో నోరు తిరగని ఎన్నో రకాలను చూసి ఉన్నారు. వాటిని పిచ్చిగా ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. కానీ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నది ఈ ఒంటి కాలి జీన్స్. దీని ధర చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే! దీని ధర 440 డాలర్లు. అంటే మన ధరలో అక్షరాలా 38వేల రూపాయలు మరి. అంత ధర పెట్టి మరీ కొనేస్తున్నారు. ఎందుకంటే ఈ జీన్స్ ఇప్పుడు అవుటాఫ్ స్టాక్ ఉండడమే!

ఫ్యాషన్ అనేది ఎప్పుడూ కొంత పోకడలు పోవడం చూస్తూనే ఉంటాం. కానీ అప్పుడప్పుడూ కొంత కొత్త, వింత పోకడలు పోతూ ఉంటుంది. ఇదిగో ఆ వింత, కొత్త పోకడే.. ఈ వన్ లెగ్డ్ జీన్స్. హై వెస్ట్‌తో, బీచీ షార్ట్‌లా కనిపించేలా ఈ జీన్స్‌ని డిజైన్ చేశారు. కేవలం ఎక్స్ ఎస్, ఎస్, ఎమ్ సైజుల్లో మాత్రమే డిజైన్ చేసింది. కోపర్ని తన పాత డెనిమ్‌లను పక్కన పెట్టి ఈ కొత్త డెనిమ్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
వన్ లెగ్డ్ జీన్స్ గురించి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా తన సోషల్‌మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తన భర్తతో జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్. ఒక కాలి జీన్స్ ఎలా వేసుకుంటారు? ఎవరైనా ఇది వేసుకుంటారా? అంటూ ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ ఆ జీన్స్ వేసుకొని చూపించింది. కాస్త రెండో లెగ్ సైజు కొంచెం కిందకు ఉంటే బాగుంటుందని అన్నది. చివరకు ఇది ఇంటర్నెట్‌లో వివాదస్పద జీన్స్ అవుతుందనే భావన వ్యక్తం చేసింది.
కోపర్ని హాఫ్-అండ్-హాఫ్ ప్యాంటును విడుదల చేసిన మొదటి దుస్తుల కంపెనీ ఏం కాదు. బొట్టెగా వెనెటా, లూయిస్ విట్టన్ ఇంచుమించు ఇలాంటి డిజైన్లను రూపొందించింది. కానీ అవేవీ సక్సెస్ బాటలో నడువలేదు. కానీ కోపర్ని వన్-లెగ్ డెనిమ్ ప్యాంట్స్ మాత్రం హిట్ డిజైన్‌గా ముద్ర వేసుకుంది.