మిస్ యూనివర్స్ 2025 పోటీలు నవంబర్‌లో జరుగనున్నాయి. దీనికి భారతదేశం తరుపున రాజస్థాన్‌కి చెందిన మాణికా విశ్వకర్మ ఎంపికైంది. అలాగే ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా ప్రపంచ వేదికపై ప్రతినిధిగా నదీన్ అయూబ్ నిలువనుంది.
ఈ సంవత్సరం చివర్లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న గ్లోబల్ 74వ మిస్ యూనివర్స్ పోటలకు అన్ని దేశాల నుంచి సుందరీమణులు సిద్ధమయ్యారు. అందులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది మాణికా విశ్వకర్మ. ఆమె గురించే కాదు.. ఈ సారి ఒక ప్రత్యేకత కూడా ఉంది. పాలస్తీనాకి చెందిన నదీన్ అయూబ్ కూడా ఈ పోటీల్లో పాల్గొనుంది.

ఎవరీ మాణికా..?
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మాణికా ఇప్పుడు ఢిల్లీలో నివసిస్తున్నారు. గతంలో మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 కిరీటాన్ని పొందిన మాణికా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వంతో చురుగ్గా వ్యవహరిస్తుంది. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పొందిన మాణికా పెయింటింగ్ కూడా చేస్తుంది. ఆమెను లలిత్ కళా అకాడమీ, జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కూడా సత్కరించాయి. న్యూరోనోవా స్థాపకురాలిగా ఆమె న్యూరోడైవర్జెన్స్‌కు మద్దతుదారుగా కూడా ఉంది. ఇది ADHD వంటి పరిస్థితుల గురించి అవగాహన పెంచడానికి అంకితమైన చొరవగా చెప్పుకోవచ్చు.

ఎవరీ నదీన్.. ?
27 ఏళ్ల మోడల్, న్యాయవాది అయిన నదీన్ అయూబ్ మిస్ యూనివర్స్ 2025 పోటీలో పాలస్తీనా ప్రజలకు గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తారని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (MUO) ధృవీకరించింది. నదీన్ అయూబ్ పోటీ ప్రపంచానికి కొత్తేమీ కాదు. ఆమె 2022లో మిస్ పాలస్తీనా కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె అందానికి మాత్రమే కాకుండా ఆమె న్యాయవాదానికి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత. ఆమె ఒక పెద్ద వేదికపైకి అడుగుపెడుతుంది. అయూబ్ పాల్గొనడం వలన అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా సంస్కృతి, స్థితిస్థాపకత, ఆకాంక్షలను హైలైట్ చేసే అవకాశం లభిస్తుంది.