గోవిందా.. సునీత ఒక అన్యోన్య జంట మొన్నటివరకు. కానీ ఇప్పుడు వాళ్లు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రే డివోర్స్ అనే పదం కూడా వినబడుతుంది. అసలు గ్రే డివోర్స్ అంటే ఏంటో తెలుసా?
బాలీవుడ్‌లో గోవింద మంచి నటుడనే పేరుంది. అంతకుమించి మంచి భర్తగా కూడా తన భార్య సునీత చాలాసార్లు పబ్లిక్‌గానే చెప్పింది. కానీ 37యేండ్ల వారి వైవాహిక జీవితం ముగియనున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఈ న్యూస్‌తో పాటు గ్రే డివోర్స్ పేరు కూడా బాగా వినిపిస్తున్నది. 50యేండ్లు పై బడిన వారు తమ దీర్ఘకాలిక వివాహాలను ముగించే ధోరణినే గ్రే డివోర్స్‌గా పిలుస్తారు.
గ్రే విడాకుల పెరుగుదల..
ప్రపంచవ్యాప్తంగా గ్రే విడాకులు పెరుగుతున్నాయి. 1990 నుంచి అమెరికాలో ఈ విడాకులు రెట్టింపయ్యాయి. భారతదేశంలో కూడా ఈ ధోరణి కనిపిస్తున్నది. సంప్రదాయాలకు విలువనిచ్చి చాలా మంది కలిసే ఉంటున్నారు. కానీ ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవాళ్లు, ఇతర కుటుంబ కారణాల వల్ల సంతోషంగా లేని వాళ్లు వివాహబంధాన్ని తుంచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యతనిస్తున్నారు.

ఎందుకిలా..
ఈ గ్రే విడాకులకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. పిల్లలు పెద్దవారై స్వతంత్రంగా ఉండటంతో చాలామంది అప్పటి వరకు తమ సమస్యలను పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది తమ ప్రాధాన్యతలు, ఆకాంక్షలు ఏకీభవించడం లేదని భావిస్తున్నారు. ఆర్థిక విభేదాలు, పరిష్కారం కాని విభేదాలు, భావోద్వేగ సంబంధం తెగిపోవడం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదనంగా, పదవీ విరమణ తర్వాత జీవనశైలి అంతర్లీన సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. జంటలు తమ సంబంధాలను పునరాలోచించుకునేలా చేస్తుంది.
కొత్త ఆరంభాలు..
జీవితంలో తరువాతి దశలో విడాకులు తీసుకోవడం వల్ల ఆర్థిక సర్దుబాట్లు, సమాజంలో మాటలు, భావోద్వేగ కల్లోలం వంటి ప్రత్యేకమైన సవాళ్లు వస్తాయి. అయితే చాలా మంది వ్యక్తులు దీనిని కొత్త ఆవిష్కరణలకు, కొత్త ప్రారంభానికి ఒక అవకాశంగా కూడా భావిస్తున్నారు. జీవితాంతం బాధ్యతగా కాకుండా వివాహం ఒక ఎంపికగా చూస్తున్నారు. వృద్ధులు ఈ మార్పును స్వీకరించడానికి ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు