నడక అనేది గొప్ప వ్యాయామం. అయితే చాలా మంది ఖాళీ కడుపుతో నడకను ప్రారంభిస్తారు. మరికొందరు తిన్న తర్వాత నడకను మొదలు పెడుతారు. అసలు ఖాళీ కడుపుతో నడువడం మంచిదా? లేకపోతే భోజనం చేసిన తర్వాత నడిస్తే ఒంట్లో కొవ్వు కరుగుతుందా? అన్న విషయం తెలుసుకోండి.
చాలామంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు, జీవక్రియను పెంచుకోవడానికి, కండరాలను టోన్ చేయడానికి నడక సహాయపడుతుంది. బరువు తగ్గించే క్రమంలో కూడా చురుకైన నడక నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అయితే కొందరు కడుపు నిండా తిన్న తర్వాత నడక ప్రారంభిస్తే, మరికొందరు ఖాళీ కడుపుతో నడుస్తుంటారు. ఈ రెండు నడకలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయని అంటున్నారు నిపుణులు.
ఖాళీ కడుపుతో..
ఎవరైనా బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఖాళీ కడుపుతో నడవడం ఎల్లప్పుడూ మంచిది. దీనిని ఫాస్టింగ్ కార్డియో అని కూడా అంటారు. ఖాళీ కడుపుతో నడిచినప్పుడు శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆహారం నుంచి గ్లూకోజ్ సులభంగా అందుబాటులో ఉండదు. ఇది కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి దారితీస్తుంది. కండరాలు సంకోచం కోసం రక్తం నుంచి చక్కెరను తీసుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు, కాలేయం కండరాలకు ఇంధనంగా గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. నిద్రలో కూడా కాలేయం రక్తప్రవాహంలోకి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల ఉదయం గ్లైకోజెన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల 70 శాతం ఎక్కువ కొవ్వు కరిగిపోతుందని నాటింగ్‌హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 2022లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో కార్డియోలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుతో నడవడం వల్ల కలిగే మరో దుష్ప్రభావం కూడా ఉంటుంది. శక్తిని అందించడానికి తగినంత కార్బోహైడ్రేట్లు లేకపోతే, శరీరం గ్లూకోనోజెనిసిస్ అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది ప్రోటీన్‌ను ఇంధనంగా మారుస్తుంది. దీని అర్థం కండరాలను పునర్నిర్మించడానికి తక్కువ ప్రోటీన్ మిగిలి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా నడవకుండా ఉంటే మంచిది.
భోజనం తర్వాత..
భోజనం తర్వాత నడక కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భోజనం తర్వాత నడిచినప్పుడు, మీ శరీరం మీరు తీసుకున్న ఆహారం నుండి గ్లూకోజ్‌ను శక్తి కోసం ఉపయోగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకతతో బాధపడేవారికి చాలా ముఖ్యం. ఖాళీ కడుపు నడకతో పోలిస్తే ఇది తప్పనిసరిగా ఎక్కువ కొవ్వును కరిగించలేకపోయినా, భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరాన్ని నివారిస్తుంది.
ఎంత నడవాలి?
బరువు తగ్గడానికి, మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు నడవండి. మొత్తంమీద, బరువు తగ్గడం అనేది మీరు ఎంత వ్యాయామం చేస్తారనే దానిపై మాత్రమే ఆధారపడి ఉండదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. తగినంత నిద్రపోవాలి. ఆహారమార్పు అనేది తప్పనిసరి అని గుర్తుంచుకోండి.