రామభక్త హనుమాన్ జయంతి శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది. ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుతారు? ఇలా రెండుసార్లు జరుపుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటి?
కార్యసిద్ధిని, శత్రుజయాన్ని అందించే హనుమను ప్రార్ధిస్తే శక్తికి, జ్ఞానానికి లోటుండదని శాస్త్రవచనం. శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకటమోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని.. తన భక్తులను కష్టాల నుంచి కాపాడతాడని హిందువుల విశ్వాసం.
మొదటి కథ..
పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతనికి సూర్యుడిని ఒక పండుగా కనిపించింది. దీంతో దానిని తినడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. దేవేంద్రుడైన ఇంద్రుడు హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేశాడు. అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోయాడు. తన వరంతో జన్మించిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చింది. దీంతో అతను గాలిని ఆపాడు. ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితిని సృష్టించింది. అప్పుడు దేవతలు అందరూ కలిసి హనుమంతుడికి రెండవ జన్మ ఇచ్చారు. అది చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు, అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా జరుపుతారు.
రెండవ కథ..
మరొక పురాణం ప్రకారం హనుమంతుని భక్తి, అంకితభావాన్ని చూసిన సీతాదేవి అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. హనుమంతుడు ఈ వరం పొందిన రోజు అది కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి. అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా పరిగణిస్తారు.
అసలైన జయంతి..
నిజానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుడుపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతీ సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజే అసలైన హనుమాన్ జయంతి.