అమెరికాలో పుట్టి, పెరిగినా.. భారతీయ మూలాలేవీ లేకుండా కూడా భారతీయతను ఇష్టపడేవారున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది.. యునైటెడ్ స్టేట్స్లో నేషనల్ ఇంటెలిజెన్స్ 8వ డైరెక్టర్ అయిన తులసి గబ్బర్డ్. ఆమె పేరు వెనుక కూడా ఒక నేపథ్యం ఉందట.
తులసి గబ్బర్డ్.. ఆమె రాజకీయ విజయాలకే కాకుండా, లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆమె ప్రత్యేకమైన పేరుతో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమెకు హిందూ మతంతో ఉన్న సంబంధం ఏంటి? ఆమె పేరు వెనుక ఉన్న నేపథ్యం ఏంటోనని అందరూ తెగ సెర్చింగ్లు చేసేస్తున్నారట. ఆ శ్రమ లేకుండా ఆమె గురించి కొన్ని వివరాలు మీకోసం..
ఆమెను భారతీయ వారసత్వంతో ముడిపెట్టే సాధారణ అపోహలు ఉన్నప్పటికీ గబ్బర్డ్ ఆమె భారతీయ సంతతికి చెందినది కాదని స్పష్టం చేశారు. ఆమె పేరు వెనుక ఆమె కుటుంబ ఆధ్యాత్మిక ప్రయాణం ఉందట. తులసి అనే పేరు హిందూ సంప్రదాయంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది పవిత్రమైన తులసి మొక్కను సూచిస్తుంది. ఇది లక్ష్మీ దేవి అవతారం, విష్ణువు దైవిక భార్య అని నమ్ముతారు. తులసి మొక్క కేవలం ఒక మూలిక మాత్రమే కాదు, హిందూ గృహాలలో ఆధ్యాత్మిక ఉనికి, స్వచ్ఛత, భక్తి, రక్షణను సూచిస్తుంది.
మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పిల్లలకు పేర్లు పెట్టడం అనేక సంస్కృతులలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అలాంటి పేర్లు తరచుగా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటాయి. చాలా కుటుంబాలకు, మతపరమైన పేరును ఎంచుకోవడం అనేది వారి నమ్మకాలను గౌరవించడానికి, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించడానికి ఒక మార్గం. గబ్బర్డ్ తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్. ఆమె హిందూ మతాన్ని స్వీకరించి దాని సూత్రాలను తన కుటుంబంలో నాటారు. ఆమె పిల్లలందరికీ హిందూ పేర్లు పెట్టారు. భక్తి, జై, ఆర్యన్, తులసి, బృందావనం.
భగవద్గీత బోధనలు, ముఖ్యంగా నిస్వార్థ చర్య లేదా “కర్మ యోగం” అనే భావన తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో తులసి గబ్బర్డ్ తరచుగా చెబుతూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం గబ్బర్డ్ “హరే రామ, హరే కృష్ణ” పాట పాడుతున్న వీడియో వైరల్ అయింది. తన రాజకీయ జీవితమంతా గబ్బర్డ్ తన హిందూ విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. ఆమె తన జీవితంలో భగవద్గీత ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ దాని ఆధారంగా కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసింది. దీపావళి వేడుకలు, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆమె మద్దతు ఇస్తుంది. హిందూ పండుగలు, కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆమె నమ్మకాల పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది.
ఇటీవల గబ్బర్డ్ ప్రధాని మోడీకి ఒక శక్తివంతమైన సందేశం రాశారు. “హిందువులను చంపిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి” నేపథ్యంలో అమెరికా సంఘీభావంగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. “పహల్గామ్లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశానికి సంఘీభావం తెలుపుతున్నాం. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారికి ప్రధానమంత్రి @narendramodi కి, భారతదేశ ప్రజలందరికీ నా ప్రార్థనలు, ప్రగాఢ సానుభూతి. ఈ దారుణమైన దాడికి కారణమైన వారిని మీరు వేటాడేటప్పుడు మేము మీతో ఉన్నాం. మీకు మద్దతు ఇస్తున్నాం” అని ఆమె X లో పోస్ట్ చేసింది.