ప్రజక్త కోలి.. ఒక యూట్యూబర్, నటి. ఆమె తన పెండ్లిలో ధరించిన ఆకుపచ్చని నెక్లెస్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అదే నేపాలీ తిల్హారీ నెక్లెస్.
ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని కర్జాత్‌లోని ఒక రిస్టార్‌లో మిస్ మ్యాచ్ బ్యూటీ ప్రజక్త కోలి వివాహం వృషాంక్‌తో జరిగింది. అతి సన్నిహితుల మధ్య ఈ వివాహం, రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నదీ అమ్మడు. అయితే ఈ ఫోటోలో అందరినీ ఆకర్షించేది ఆమె మెడలోని ఆకుపచ్చని గొలుసు. నేపాలీ వారసత్వానికి నివాళిగా ఈ నెక్లెస్‌ని ధరిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇది నేపాలీ వధువులు ధరించే ప్రత్యేక మంగళసూత్రం.

నేపాలీ తాళి..
తిల్హారీ కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఇది కొత్త వధువులకు వారి తల్లులు, అమ్మమ్మల నుంచి లేదా కొన్నిసార్లు వరుడి కుటుంబం నుంచి అందించబడిన విలువైన ఆభరణం. బంగారు లాకెట్టును ప్రత్యేకమైన నమూనాలతో తయారుచేస్తారు. పెళ్లి రోజు కాకుండా, ఒక స్త్రీ ఇతర ముఖ్యమైన సందర్భాలలో, పండుగలలో కూడా తిల్హారీని ధరించవచ్చు.
నెక్లెస్‌లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి.. పోటే అని పిలువబడే చిన్న పూసలు, తిల్హారీ అని పిలువబడే స్థూపాకార బంగారు లాకెట్టు. ఈ ముక్కలను సాధారణంగా విడిగా కొనుగోలు చేస్తారు. తరువాత నెక్లెస్‌ను పూర్తి చేయడానికి కలపవచ్చు. ఇది నేపాలీ వధువులకు ప్రత్యేక సాంస్కృతిక అర్థాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది వారి వైవాహిక స్థితిని సూచిస్తుంది. అంతేకాదు.. వారి వివాహ జీవితానికి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. నెక్లెస్ యొక్క పొడవును వధువు ప్రాధాన్యత ఆధారంగా ఎంచుకోవచ్చు. చాలామంది వధువులు ఎరుపు తిల్హారీని ఎంచుకుంటారు. ఇదికాకుండా.. పసుపు, ఆకుపచ్చ తిల్హారీలు కూడా ఉంటాయి. ప్రజక్త కోలీ వేసుకుంది ఆకుపచ్చని తిల్హారీ.