బ‌ట్ట‌త‌ల‌ను బ్రాండ్ బోర్డ్‌గా మార్చుకున్న ట్రావెల్ వ్లాగ‌ర్‌!

చిన్న‌, పెద్దా వ‌య‌సు తేడా లేకుండా జుట్టు ఊడిపోవ‌డం మామూలు అయిపోయింది. మ‌గ‌వాళ్ల‌కు బ‌ట్ట‌త‌ల‌లు రావ‌డం స‌హ‌జం. అయితే ఆ బ‌ట్ట‌త‌ల‌ను బ్రాండ్ కోసం బోర్డ్‌గా మార్చుకున్న ఒక వ్య‌క్తి పెట్టిన పోస్ట్‌, అత‌ని గురించి నెట్టింట చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

బ‌ట్ట‌త‌ల అనేది సిగ్గుప‌డాల్సిన విష‌యం కాదు. దాంతో కూడా ఇప్పుడు డ‌బ్బులు సంపాదించొచ్చ‌ని నిరూపించాడు కేర‌ళ‌లోని అల‌ప్పూజాకి చెందిన ష‌ఫీక్ హ‌షీమ్‌. ఇత‌నొక ట్రావెల్ వ్లాగ‌ర్‌. ఇప్పుడు బ‌ట్ట‌త‌ల‌ను ఒక బ్రాండ్‌కి బోర్డ్‌గా ఉంటూ ఆ యాడ్‌కి 50వేల రూపాయ‌ల ఆదాయాన్ని పొందుతున్నాడు.

సోష‌ల్ మీడియాలో..

ష‌ఫీక్ హ‌షీమ్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ య‌థాత‌థాంగ మీకోసం..

అంద‌రికీ న‌మ‌స్కారం..

ఇటీవల నేను జుట్టు మార్పిడి చేయించుకోవాలని ఆలోచిస్తున్నాను. అది నాకు అవసరమా అని నాకు సందేహంగా ఉంది. కానీ కొంత లోతుగా ఆలోచించిన తర్వాత నాకు నేను నిజాయితీగా ఉండటం ముఖ్యమని గ్రహించాను. బట్టతల సహజంగా వ‌చ్చింది. దానిని స్వీకరించడంలో నాకు సిగ్గు లేదు. నిజానికి, బట్టతల అందంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఇతరులు తాము ఎవరో నమ్మకంగా ఉండేలా ప్రేరేపించాలనుకుంటున్నాను.

దానిని దృష్టిలో ఉంచుకుని, నేను ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చాను. నేను నా బట్టతల తలను ప్రకటనల కోసం అద్దెకు ఇవ్వాల‌నుకుంటున్నా. ఏదైనా బ్రాండ్ వారి లోగో లేదా సందేశాన్ని నా తలపై ప్రదర్శించాలనుకుంటే మీరు నాతో భాగస్వామిగా ఉండటానికి స్వాగతం ప‌లుకుతున్నా.

నేను 28 వేల మంది అనుచరులను కలిగి ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌ ట్రావెల్ వ్లాగర్‌ను కూడా. నా సాహసాల ద్వారా, మీ బ్రాండ్ విస్తృత, విభిన్న ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. కాబట్టి మీరు సృజనాత్మకంగా, ధైర్యంగా ప్రకటన చేయడానికి వెతుకుతున్న ప్రసిద్ధ బ్రాండ్ అయితే, సహకరించుకుందాం!

బట్టతలని ఒక ప్రకటనగా చేద్దాం. ఆసక్తి ఉన్న బ్రాండ్లు నన్ను నేరుగా సంప్రదించవచ్చు.

దయచేసి షేర్ చేయండి !!! అంటూ ఒక పోస్ట్ రాసుకొచ్చాడు.

బ్రాండ్ బోర్డ్‌గా..

ఈ పోస్ట్‌ని చూసి ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ క్లినిక్ యాడ్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌యింది. కొచ్చికి చెందిన వారి యాడ్‌ని టాటూ స్టిక్క‌ర్ ఉప‌యోగించి త‌న బ‌ట్ట‌త‌ల మీద అతికించుకున్నాడు ష‌ఫీక్‌. మూడు నెల‌ల పాటు మాత్ర‌మే ఈ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేస్తాడు. దానికి అత‌ను 50వేల రూపాయ‌లు తీసుకుంటున్నాడు. అంతేకాదు.. త‌న ఫ్రెండ్స్‌కి ఈ యాడ్ చూపిస్తూ ఒక వీడియో కూడా తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఒక‌ప్పుడు అత‌ని బ‌ట్ట‌త‌ల‌ని చూసి ఏడిపించిన వారే.. ఇప్పుడు అత‌ని ఆలోచ‌న చూసి మెచ్చుకుంటున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress