బతుకుకు సంబురాన్నిచ్చే పండుగ.. తెలంగాణ బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో.. ఆటపాటల కోలాహలంతో నిండిపోయే ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. అయితే ఈ పండుగ విశిష్టత గురించి మీకు తెలుసా?
ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ.. అంటూ పాడుకుంటూ పూలతో బతుకమ్మను పేరుస్తారు. గునుగు.. తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా ఒక్కో పువ్వును వరుసగా పేరుస్తూ అమ్మలక్కాలంతా చేరి ఆనందంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఈ బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, నైవేద్య సమర్పణ ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.
ఎంగిలి పూల బతుకమ్మ
చిన్న పూలతో అలకరించబడిన బతుకమ్మను ఆ విధంగా పిలుస్తారు. నువ్వులు, బెల్లం, అటుకులను ఆ దేవతకు సమర్పిస్తారు. ఈ రోజున ఆ అమ్మను ఎలా ఇందుకు కొలుస్తారంటే.. కుటుంబానికి ఆరోగ్యం, శాంతి, సంపద రావాలని ప్రార్థిస్తారు.
అటుకుల బతుకమ్మ
ఈ రోజు కూడ ఏ పూలతోనైనా బతుకమ్మను తయారుచేయొచ్చు. కాకపోతే.. అటుకులు, దోశలు, పెరుగు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు.. పంటలు బాగా పండాలని, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ బతుకమ్మను వేడుకొంటారు.
ముద్దపప్పు బతుకమ్మ
ఈ రోజు బతుకమ్మకు ముద్దపప్పును నైవేద్యంగా పెడుతారు. అంతేకాదు.. పప్పుతో పాటు, బెల్లం సమర్పణ చేయాలి. అందమైన ఈ బతుకమ్మను ఆరాధించడానికి కారణం.. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లలకు మంచి బలం, సుఖ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు.

నానబియ్యం బతుకమ్మ
పూలతో అలంకరించిన ఈ బతుకమ్మకు నానబెట్టిన బియ్యం నైవేద్యం. దీంతోపాటు.. బెల్లం కూడా పెట్టాలి. భూమికి కృతజ్ఞత, పంటల సంపద కోసం, పిల్లలు, కుటుంబం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.
అట్ల బతుకమ్మ
బతుకమ్మకు ఈ రోజు అట్లు అనగా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు.. పెరుగు, బెల్లం, పూలు ఆ దేవతకు సమర్పిస్తారు. కుటుంబ ఐక్యత, సుఖ సంతోషం, గ్రామ పౌరుల శ్రేయస్సు కోసం ఈ రోజున అట్ల బతుకమ్మను జరుపుతారు.
అలిగిన బతుకమ్మ
ఈ రోజు కొన్నిచోట్ల బతుకమ్మను పేర్చరు. అంటే.. ఆ రోజు అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని అంటారు. కానీ కొన్నిచోట్ల బతుకమ్మను పేర్చి ఇంట్లోనే ఒక పక్కగా ఉంచి పూజ చేస్తారు. భక్తి, వినయం, ఆధ్యాత్మికతను చూపించే రోజుగా దీన్ని గుర్తించాలి.

వేపకాయల బతుకమ్మ
ఈ రోజున పూలతో పాటు.. ప్రత్యేకంగా వేపకాయలతో ఈ బతుకమ్మను పేరుస్తారు. ఎవరి ఇష్టానుసారం తోచిన విధంగా ఈ రోజున నైవేద్యం సమర్పించవచ్చు. ఆరోగ్యం, వ్యాధులకు దూరంగా ఉండాలని, కుటుంబ ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటారు.
వెన్నముద్దల బతుకమ్మ
ఈ రోజు రంగు రంగులతో బతుకమ్మను పేర్చి కృష్ణుడికి ఎంతో ప్రీతి పాత్రమైన వెన్నముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా పెడుతారు. కుటుంబ సుఖం, శాంతి, పిల్లలకు శక్తి, ఐక్యత కోసం ఆ దేవతను ప్రార్థిస్తారు.
సద్దుల బతుకమ్మ
చివరి రోజు బతుకమ్మనే.. పెద్ద బతుకమ్మగా పిలుస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. రకరకాల వంటకాలు.. పులిహోర, పెరుగన్నం, పల్లీ పొడి, సత్తుపిండి ఇలా అనేక రకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పంటల సంపద, ఆరోగ్యం, కుటుంబ సౌభాగ్యం, గ్రామాభివృద్ధి కోసం ఈ పండుగను ఆనందగా జరుపుతారు.
