కొబ్బరికాయ-కేరళ ఈ రెండింటికీ ఒక అవినాభవ సంబంధం ఉందని అందరూ నమ్ముతారు. అలాగే అక్కడి పుట్టి, పెరిగిన ఈ అమ్మాయికి కూడా ఆ కొబ్బరికాయ చిప్పలను అలా వృథాగా పడేయడం ఎందుకని వాటితో ఉత్పత్తులు తయారు చేస్తుంది.
కేరళ కొబ్బరికాయల ఉత్పత్తిలో మొదటి స్థానమని అందరికీ తెలుసు. కొబ్బరి నీరు, పీచు.. ఇలా ప్రతిదీ ఉపయోగకరమే. కానీ కొబ్బరి చిప్ప వరకు వచ్చేసరికి దానిని ఒక వ్యర్థంగా పరిగణిస్తారు. కానీ కేరళలోని త్రిస్సూర్‌కి చెందిన మరియా కురియాకోస్ ఒక ఆలోచన చేసింది. థెంగా అనే ఒక కంపెనీని మొదలుపెట్టి కొబ్బరి చిప్పలను అందమైన అలంకరణ వస్తువులుగా, ఇతర అనేక ఉత్పత్తులను తయారు చేస్తుంది. అయితే ఆమె మొదలు పెట్టిన ఈ వెంచర్ అంత సులభంగా మొదలుకాలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి తన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకుంది.
బలమైన కోరిక..
చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికీ ఒక్కో కోరిక ఉంటుంది. కురియాకోస్కి కూడా ఒక బలమైన కోరిక తన మనసులో ఉంది. అదేంటంటే.. ఒక సొంత వ్యాపార సంస్థను నెలకొల్పి, నలుగురికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది పర్యావరణ అనుకూలంగా ఉండాలని ఆశపడింది. కానీ వ్యాపారం చేయాలంటే తన చేతిలో ఎంతో కొంత ఉండాలి. దానికోసం ముంబైలోని ఒక కార్పొరేట్ సంస్థలో పని చేసింది. కానీ ఎప్పటికైనా తన స్వస్థలానికి వచ్చి ఒక స్థిరమైన వ్యాపారం చేయాలనుకుంది. కొబ్బరినూనె తయారీ యూనిట్లకు వెళ్లింది. అక్కడ కొబ్బరి చిప్పలు నిరుపయోగంగా పడి ఉండడం చూసి తన మనసులో ఒక ఆలోచన మొదలైంది. వాటిని ఏమైనా చేయగలమో ఆలోచించింది. వాటితో ముందుగా సాధారణ గిన్నెలను తయారుచేసింది. అయితే వాటిని తన స్నేహితులకు, తెలిసిన వారికి పంపింది. కాలక్రమంలో ఆమె వ్యాపారమే కాదు.. ఉత్పత్తుల సంఖ్య పెరిగింది.

ఇబ్బందులు మొదలు..
వ్యాపారం ప్రారంభించడంతోనే పని కాదు. దానికి చాలా కష్టాలు పడాలి. కురియాకోస్ ఆ చిప్పలను శుభ్రం చేయడం అంతా సొంతంగా చేసింది. ఆ పని చాలా కష్టంతో కూడుకున్నది. కానీ చాలా ఓపికగా చేసేది. కానీ కరోనా సమయంలో వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడింది. అంతేకాదు.. సింగిల్ ఆర్డర్ వచ్చినప్పుడు పర్వాలేదు, కానీ అదే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు కావాలనుకున్నప్పుడు కూడా అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే చిప్పలన్ని ఒకే పరిమాణంలో ఉండకపోవచ్చు. కానీ ఆర్డర్ ఇచ్చిన వారికి ఒకేలా ఉండాలనే నియమం ఉంటే మాత్రం కష్టాలు మొదలెనంటుంది కురియాకోస్. అంతేకాదు.. ఈ ప్రయాణంలో తండ్రి సహాయం మరువలేనంటుందీమె. ఎందుకంటే కొన్ని యంత్రాలను ఏర్పాటు చేయడంలో ఆయన తోడ్పాటునందించారు. ఆ తర్వాత హ్యాండ్‌హెల్డ్ టూల్స్, బఫింగ్ మెషీన్లు, లోగో ప్రింటింగ్ టూల్స్‌లో పెట్టుబడి పెట్టింది. అయినప్పటికీ ఇది తనకు చాలా మూలధన-ఇంటెన్సివ్ వ్యాపారం కాదని ఆమె నొక్కి చెబుతుంది.

సవాళ్లను ఎదురించి..
ఈ వ్యాపారం కురియాకోస్ ముఖ్యంగా మూడు సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెబుతున్నది. అందులో మొదటిది కుటుంబంలో మొదటి వ్యవస్థాపకురాలిగా ఉండడం అంతా సులభం కాదు. ఎందుకంటే వ్యాపార నేపథ్యం గురించి కుటుంబంలో ఎవరికీ తెలియదు. దీంతో ప్రతిదీ తానే చూసుకోవాల్సి వచ్చింది. రెండవది ఒక బృందాన్ని తయారుచేయడం. థెంగా అని పేరు పెట్టి అందులో నలుగురిని చేర్చుకుంది. ఒక చిన్న యూనిట్‌గా ప్రారంభించింది. ఇప్పుడు కేరళలోని ఇతర జిల్లాల్లో కూడా ఇంటి వద్దే ఉండి పని చేసే మరో ఏడుగురిని కూడా చేర్చుకుంది కురియాకోస్. ఇలా వారిని ఒకతాటి పై నడిపించడం నిజంగా సవాలే. ఇక రెండవది ప్లాస్టిక్ ఉత్పత్తిలా కాకుండా ఈ ఉత్పత్తులు సహజమైనవి. పైగా ఒకే పరిమాణంలో, ఆకారంలో రావడం అనేది జరుగదు. దీనివల్ల కస్టమర్ల దగ్గర నుంచి ఒక్కోసారి మాటరావడం సహజం. ఇది తాను ఎదుర్కొన్న చివరి సవాలు.

విజయమే పరమావధిగా..
2019లో వ్యాపారాన్ని ప్రారంభించడం అందరూ ప్రమాదంగా భావించవచ్చు. కానీ కోవిడ్ సమయంలో అందరూ జీవనశైలి పట్ల మరింత అవగాహన పెంచుకున్నారు. అది కురియాకోస్కి వరంగా మారింది. దీంతో థెంగా పై పెద్దగా ప్రభావం పడలేదంటున్నది. కొబ్బరి చిప్పలతో.. తయారు చేసిన గిన్నెలు మాత్రమే కాదు, కప్పులు, కొవ్వొత్తి హోల్డర్లు, కంటైనర్లు, ప్లాంటర్లు, కత్తిపీటలు కూడా ఆమె వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడ్డాయి. ఆమె వ్యాపారం దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలైన.. ఢిల్లీ, ముంబై ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో సైతం విస్తరించింది. వీటితో పాటు కొబ్బరి చిప్పలతో బొమ్మలను తయారుచేయాలనే ఆలోచన కూడా చేస్తున్నది. మరి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే! “భారతదేశంలోని అందరు మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు నిజంగా ఏమి ఇష్టపడుతున్నారో, మీరు నిజంగా దేని కోసం పని చేయాలనుకుంటున్నారో ఆలోచించి ఆపై నిజంగా ప్రయత్నించమని నేను సిఫార్సు చేస్తున్నాను. ఆ రిస్క్ తీసుకోండి. మీరు విఫలమైనా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తులో ఏమీ చేయలేకపోయమనే భావన ఉండిపోకూడదు* అంటున్నది కురియాకోస్.
