ఎంతో ధరలను పెట్టి పట్టు బట్టలు, చీరలను కొంటాం. వాటిని డ్రై వాష్ మాత్రమే చేయించాలి. ప్రతీసారి అలా చేయించడం ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా ఇంట్లోనే ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో కూడా చదువండి.
ఖరీదైన డ్రై క్లీనింగ్ అవసరమనే అపోహతో పట్టు వస్త్రాలను ఎక్కువ సార్లు కట్టడానికి ఆలోచిస్తుంటారు. అలా ఊరికే ఇవ్వడం వల్ల కూడా వాటి మన్నిక తగ్గుతుంది. అందుకే ఇంట్లోనే మీ చేతులతోనే చక్కగా ఉతికి ఆరేయొచ్చు. అలాగే కాస్త శ్రద్ధ తీసుకుంటే పట్టు చీరలను భద్రంగా ఉంచుకోవచ్చు.

ఎలా ఉతకాలి?
- పట్టు బట్టల కోసం వేడి నీటిని అస్సలు వాడకూడదు. చల్లని నీటిలో పట్టు బట్టలను సున్నితంగా ముంచి కాసేపు అలాగే ఉంచండి.
- హార్డ్ డిటర్జెంట్ కాకుండా.. పట్టు వస్త్రాల కోసం కాస్త సున్నితమైన డిటర్జెంట్స్ దొరుకుతాయి. వాటిని నీటిలో వేసి మెల్లగా కలిపి మరికాసేపు నానబెట్టండి.
- కాసేపటి తర్వాత సబ్బుతీసుకొని మెల్లగా మూడు నిమిషాల పాటు చేతితోనే రుద్దండి.
- ఆ తర్వాత మెల్లగా పిండండి. తద్వారా మురికి వదులుతుంది. సబ్బు నీటి నుంచి చీరను తీసివేసి మంచి నీటితో జాడించండి.
- రెండుసార్లు నీటిలో ముంచి నీరు పూర్తిగా పోయేవరకు టవల్‌పై వేయండి. అదనపు తేమను పీల్చుకోవడానికి మరో పొడి టవలులో చుట్టండి. ఈ సమయంలో బట్టలను రుద్దడం, కదలించడం చేయొద్దు.
- నీరంతా పోయాక చివరగా పట్టు చీరను హ్యాంగర్ లేదా డ్రైయింగ్ రాక్ పై వేలాడదీయండి. అంతేకాదు.. మరీ ఎండలో కాకుండా నీడలో ఉంచి బట్టలను ఆరేయాలి. ఎండలో వేస్తే రంగు మారిపోవచ్చు.

జాగ్రత్త ఎలా..?
- పట్టు వస్త్రాలను ఇస్త్రీ చేసేటప్పుడు లోపల నుంచి చేయాలి. అలాగే వేడి తక్కువ సెట్టింగ్‌ను ఉపయోగించండి. అదనంగా పట్టు బట్టలకు, ఇస్ట్రీ పెట్టెకు మధ్య ఒక కాటన్ ఫ్యాబ్రిక్‌ని ఉంచి ఇస్త్రీ చేస్తే మరీ మంచిది. దీనిద్వారా ముడతలు మంచిగా పోతాయి.
- పట్టు బట్టలు ఎక్కవ కాలం మన్నికగా ఉండాలంటే.. వాటిని ఇతర వస్త్రాలతో కలిపి పెట్టకూడదు. కుదిరితే గాలి చొరబడని ఒక కాటన్ వస్త్రంలో చుట్టి పెడితే మరీ మంచిది. ఎన్ని సంవత్సరాలైన చీర సహజంగా, చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తుంది.
- పట్టు బట్టలను గాలి చొరబడకుండా ఉండే ప్రత్యేకమైన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించండి. ఇది మీ పట్టు వస్త్రాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది.