స్వ‌స్తిక్ గుర్తు ఎందుకు వేస్తారు? ఎక్క‌డెక్క‌డ వేస్తే మంచిదో తెలుసా?

ఓంకారం తర్వాత అత్యధిక ప్రాముఖ్యత కలిగిన చిహ్నాలలో స్వస్తిక్ ముందు వరుసలో నిలుస్తుంది. మ‌రి ఆ స్వ‌స్తిక్ గుర్తు ఎక్క‌డెక్క‌డ వేస్తారో తెలుసుకోండి. అస‌లు ఈ స్వ‌స్తిక్ గుర్తుకు అర్థం ఏంటో చ‌దువండి.

స్వస్తిక అనే సంస్కృత పదానికి “పవిత్రమైనది, శుభప్రదమైనది” అని అర్థం. అందువల్ల, ఈ చిహ్నాన్ని రోజువారీ పూజా కార్యక్రమాలలో ఎవరైనా పూజించినా లేదా ఉపయోగించినా వారికి శుభం, సంతోషం లభిస్తాయని నమ్ముతారు.

ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలని భావిస్తారు. దీపావళికే కాకుండా షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, ఇంటి గృహప్రవేశం సమయంలో, పెళ్లి పత్రికలపై స్వస్తిక్ గుర్తు వేస్తారు.

స్వస్తిక్ ప్రాముఖ్యత..
స్వ‌స్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వ‌చ్చే చిహ్నం సూర్యున్ని ప్ర‌తిబింబిస్తుంది. అది కాంతికి జ‌న్మ‌స్థానంగా చెప్ప‌బ‌డుతుంది. అది విశ్వంలో న‌లువైపులకు వ్యాపిస్తుంది. స్వ‌స్తిక్‌కు ఉండే నాలుగు రేఖ‌లు నాలుగు దిక్కుల‌ను కూడా సూచిస్తాయి. ఉత్త‌రం, ద‌క్షిణం, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌ను అవి సూచిస్తాయి. స్వ‌స్తిక్ మ‌ధ్య‌లో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్ర‌హ్మ పుట్టాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భ‌వించి విస్త‌రించింద‌ని చెబుతారు. స్వ‌స్తిక్ మ‌ధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు. స్వ‌స్తిక్ చిహ్నంలో ఒక రేఖ‌ను బ్ర‌హ్మదేవుడిగా భావిస్తారు. మ‌రొక రేఖ‌ను నాలుగు వేదాల‌ని చెబుతారు. మ‌రొక రేఖ‌ను నాలుగు పురుషార్థాల‌ని భావిస్తారు. ఇంకో రేఖ‌ను పౌరులు పాటించాల్సిన ఆశ్ర‌మ ధ‌ర్మాల‌ని చెబుతారు. వేదాలు నాలుగు – రుగ్వేదం, సామ‌వేదం, య‌జుర్వేదం, అథ‌ర్వ‌ణ వేదం. పురుషార్థాలు కూడా నాలుగు – ధ‌ర్మ‌, అర్థ‌, కామ‌, మోక్షాలు. ఆశ్ర‌మ ధ‌ర్మాలు కూడా నాలుగు అవి బ్ర‌హ్మ‌చ‌ర్య‌, గృహ‌స్థ‌, వాన‌ప్ర‌స్థ‌, స‌న్యాస ధ‌ర్మాలు.

వాస్తు శాస్త్రం ప్రకారం..
ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక్ గుర్తును చిత్రిస్తారు. ఇది అనేక శుభ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శాంతిని పెంపొందిస్తుంది, ఇంటిని ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది. ఈ శుభ చిహ్నం నిర్వహించబోయే కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. స్వస్తిక్ సంపద దేవుడు కుబేరుడికి సంబంధించినది. దానిని సరైన స్థలంలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. స్వస్తిక్ ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణాన్ని సృష్టిస్తుంది.

స‌రైన స్థ‌లాలు..
స్వస్తిక్ చిహ్నాన్ని ఇంట్లో శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సానుకూల శక్తి, శ్రేయస్సు, శాంతిని సూచిస్తుంది. ఇంట్లో స్వస్తిక్ ఉంచడానికి కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి.


ప్రధాన ద్వారం
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేలా దీన్ని ఉంచుతారు.

పూజ గది
పూజ గదిలో లేదా ఆలయంలో స్వస్తిక చిహ్నాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదం. ఇది మత విశ్వాసాలను బలోపేతం చేస్తుంది. ఇంటికి శాంతి, శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లోని పూజ గది తలుపుల ఎగువ భాగంలో స్వస్తిక్‌ గుర్తును గీయడం వ‌ల్ల పాజిటివ్‌ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది. ఎల్లప్పుడూ స్వస్తిక్ గుర్తును గీయడానికి ఎరుపు, నారింజ లేదా గోధుమ రంగు వంటి రంగులను వాడండి.

గోడపై
ఇంటి గోడలపై, ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశలలో స్వస్తిక్ చిత్రం లేదా చిహ్నాన్ని ఉంచడం కూడా మంచిది.

ఇష్టమైన ప్రదేశం

మీకు వంటగది, లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ వంటి ఇష్టమైన స్థలం ఉంటే స్వస్తిక్ చిహ్నాన్ని ఇక్కడ ఉంచడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఆ స్థలం నుంచి ఇంట్లో సానుకూలత లోపించ‌ద‌ని భావిస్తే గీయండి.

స్వస్తికను ఎప్పుడూ క్రింది దిశలో వేయకూడదు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. శక్తి ప్రవాహం సరైన దిశలో ఉండేలా దీన్ని ఎల్లప్పుడూ పైకి ఉంచాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress