ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరాలంటే అంత ఆషామాషీ కాదు. కఠోర శ్రమ, అంతకుమించి శిక్షణ అవసరం. దానికోసం ట్రెయినర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంటారు. కానీ కేరళకి చెందిన వసంతి మాత్రం యూట్యూబ్ చూసి తన శిక్షణ పూర్తి చేసుకుంది.
కేరళకు చెందిన 59 ఏళ్ల వసంతి టైలరింగ్ చేస్తుంటుంది. వయస్సు, అనుభవం సాహసయాత్రకు అడ్డంకులు కాదని నిరూపించిందామె. కన్నూర్‌కు చెందిన వసంతి చెరువువీట్టిల్ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా సోలోగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకుంది. తనంతట తానుగా ఆ సవాలు విసురుకొని ఈ సాహసయాత్రకు పూనుకుంది. ఆమె ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే!
యూట్యూబ్ చూసి..
ఎటువంటి మార్గదర్శకత్వం లేకుండా, వసంతి ట్రెక్కింగ్ ప్రాథమికాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ వీడియోలపై ఆధారపడింది. నాలుగు నెలల పాటు యూట్యూబ్ చూసి ఆమె ఇంట్లో శిక్షణ పొందింది. ప్రతిరోజూ నాలుగు గంటలు నడవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గేర్‌తో సౌకర్యవంతంగా ఉండడానికి ట్రెక్కింగ్ బూట్లు ధరించడం కూడా సాధన చేసింది. ఫిబ్రవరి 15న ఆమె నేపాల్‌లోని సుర్కే నుండి తన ట్రెక్కింగ్‌ను ప్రారంభించి, ఫిబ్రవరి 23న దక్షిణ బేస్ క్యాంప్‌నకు చేరుకుంది. తొమ్మిది రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసింది. తను ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకోగానే కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి ఫొటో తీసుకోవాలని ఆ బట్టలను అక్కడ ధరించాలనుకుంది. అక్కడ ప్రమాదం అని తెలిసినా ధైర్యంగా ఆ పని చేసి చూపించింది.

మొదటిది కాదు..
ఇది ఆమె మొదటి సోలో ట్రిప్ కాదు. గత సంవత్సరం ఆమె స్నేహితులతో కలిసి థాయిలాండ్ వెళ్లాలనుకుంది. కానీ వాళ్లంతా వెనక్కి తగ్గడంతో తాను ఒంటరిగా థాయిలాండ్‌కు ప్రయాణించింది. ఆమె ఇద్దరు కుమారులు వినీత్, వివేక్ ప్రోత్సాహంతో ఒంటరిగా ప్రయాణాన్ని బుక్ చేసుకుంది. వసంతి ఎవరెస్ట్ పర్వతారోహణలో సవాళ్లు లేకుండా ఏమీ లేవు. చెడు వాతావరణం కారణంగా లుక్లాకు ఆమె విమానం రద్దు చేయబడింది. కానీ నేపాల్‌లో ఆమె కలిసిన జర్మన్ జంట సుర్కే ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనడంలో ఆమెకు సహాయపడింది.
దృఢ సంకల్పంతో..
ఒక మహిళగా ఒంటరిగా ప్రయాణించడం కష్టం కాదని ఆమె నమ్ముతుంది. మీకు ఏది సరైనదో మీకు తెలిసినంత వరకు, మీ మార్గాన్ని అనుసరించాలనే దృఢ సంకల్పం ఉన్నంత వరకు, ప్రతిదీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది” అని ఆమె చెప్పింది. వసంతి తన టైలరింగ్ పని ద్వారా తన ప్రయాణాలకు కావాల్సిన డబ్బులను సమకూరుస్తుంది. అప్పుడప్పుడు తన కొడుకుల నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటుంది. త్వరలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించడంపై దృష్టి పెట్టాలనుకుంటుంది.