బొట్టు పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టుకున్న వాళ్ల ముఖం కాంతివంతంగా, తేజోవంతంగా కనిపిస్తుంది. అయితే ఏ వేలితో బొట్టు పెడితే అర్థమేంటో తెలుసుకోండి.
మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు అంటుంటారు. అయితే మనం బొట్టు పెట్టుకోవడం, ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలితో పెట్టాలో చెప్పే కథనం ఇది.
బొటనవేలు..
బొటనవేలుతో బొట్టు పెట్టడమంటే.. ఎవరికైనా శక్తి, విజయం, ఆశీర్వాదం ఇవ్వడమే. బొటనవేలుతో తిలకం పెట్టడమంటే దృఢ సంకల్పాన్ని పెంచేందుకు ఈ బొట్టు సహాయపడుతుంది. అందుకే యుద్ధానికి వెళ్లేముందు ఆశీర్వదిస్తూ బొటనవేలితో నుదిటిపై తిలకం దిద్దుతారు. అలాగే ఒక సోదరి తన సోదరుడికి రాఖీ కడుతూ కూడా ఈ బొటనవేలితో తిలకం పెట్టడం ఎప్పటి నుంచో ఉంది.

చూపుడువేలు..
తిలకం వేసేటప్పుడు, ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. బతికి ఉన్నవారికి తిలకం పెట్టడానికి చూపుడు వేలును ఎప్పుడూ ఉపయోగించకూడదు. మరణించిన పూర్వీకులను లేదా మరణించిన ఆత్మలను గౌరవించేటప్పుడు మాత్రమే చూపుడు వేలును ఉపయోగిస్తారని నమ్ముతారు. చూపుడు వేలు మోక్షంతో ముడిపడి ఉంటుంది. మీరు చూపుడు వేలును ఉపయోగించి మరణించిన వ్యక్తి చిత్రపటానికి తిలకం వేసినప్పుడు అది వారిని మోక్షానికి సరైన మార్గంలోకి తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నమ్ముతారు.

ఉంగరపు వేలు..
తెల్లవారి లేస్తే పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. దేవుడి ఫోటోలకు ఉంగరవేలితో బొట్టు పెట్టాలి. భక్తి, నిబద్ధతతో దేవుడి అనుగ్రహాన్ని పెంచేందుకు ఈ వేలు ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికి వారు బొట్టు పెట్టుకోవాలంటే కూడా ఉంగరపు వేలు ఉత్తమమని చెబుతారు. ఉంగరపు వేలితో తిలకం పెట్టడమంటే.. జ్ఞానం, తెలివితేటలు, మెరుగైన మానసిక ఆరోగ్యం, శక్తితో ముడిపడి ఉన్న ఆగ్య చక్రాన్ని సక్రియం చేస్తుందని చెబుతారు.
మధ్యవేలు..
ఈ వేలు శని స్థానంగా భావిస్తారు. మధ్యవేలితో బొట్టు పెట్టుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుందని అంటుంటారు. అంతేకాదు సంపద లభిస్తుందని అంటారు. కానీ ఎదుటివారికి బొట్టు పెట్టడానికి ఈ వేలిని వాడకూడదు. ఎందుకంటే వారు చేసిన కర్మలు మనకు అంటుతాయని అంటారు.
చిటికెన వేలుతో బొట్టు పెట్టరు. భూత, తంత్రక్రియలు చేసేటప్పుడు ఈ వేలితో బొట్టు పెట్టుకుంటారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.