ఏడు సంవత్సరాల వయసులోనే సంయుక్త నారాయణన్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా అవతరించింది. ఈ అద్భుతమైన ఘనత ఆమెను ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

అభిరుచి, అంకితభావం, నైపుణ్యం ఉన్న చోట వయస్సు ఒక నంబర్ మాత్రమే అని నిరూపించింది. ఆమె తైక్వాండో ఎలా చేయాలో ఇతరులకు నేర్పుతుంది. ఆమె అసాధారణ ప్రతిభ , దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మధురైకి చెందిన 7 సంవత్సరాల సంయుక్త నారాయణన్ అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో శిక్షకురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది.
మూడు సంవత్సరాల చిన్న వయస్సులోనే తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించిన సంయుక్త ఇప్పుడు తన అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించే ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు ప్రఖ్యాత తైక్వాండో ఛాంపియన్లు. శ్రుతి, నారాయణన్.. మధురై తైక్వాండో అకాడమీని నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇద్దరు కూడా గిన్నిస్ రికార్డు సాధించారు. వీరిద్దరినీ చిన్నప్పటి నుంచి చూసి పెరుగడంతో తాను కూడా వారిలా కావాలనుకుంది.
సంయుక్త సాధించిన విజయం ఇతర పిల్లలకు ప్రేరణగా నిలుస్తుంది. రోజూ 5 కిలోమీటర్ల పరుగుతో తన రోజు మొదలవుతుంది. ఆమె కొరియాలోని ప్రపంచ తైక్వాండో ప్రధాన కార్యాలయం నుంచి బ్లాక్ బెల్ట్ హోల్డర్‌గా పట్టభద్రురాలైంది. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత చందంగా ఆమె విజయాన్ని అందరూ ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.