భారతీయ ఆహారంలో వెల్లుల్లి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ వంటకాలకు మరింత రుచిని జోడించే అల్లం, వెల్లుల్లి పేస్ట్ దేశీ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. మరి రుచి కోసమే కాదు.. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది.
రోజుకో వెల్లుల్లి రెబ్బ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. కొందరు తేనెలో వీటిని నానేసుకొని మరీ తింటుంటారు. వీటివల్ల గుండెజబ్బులు రావని నిపుణులు కూడా చెబుతున్నారు. అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్న వెల్లుల్లి గురించి తెలుసుకోండి. ఆరోగ్యానికి సహాయపడే ఈ 7 మార్గాలు మీకోసం..
రోగనిరోధక శక్తి ..
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూతో పోరాడడంలో సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు.. అనుబంధ వ్యాధుల నుంచి రక్షించవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం మంచిది. కొన్ని నివేదికల ప్రకారం.. వెల్లుల్లి, లవంగాలను దారానికి కట్టి పిల్లల మెడకు వేలాడదీయడం వల్ల వారికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కలుగవు.
రక్తపోటును..
అనియంత్రిత అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాదు.. గుండెపోటు, దీర్ఘకాలిక గుండె వైఫల్యానికి ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి మూలం అధిక రక్తపోటు. దీన్ని నియంత్రించాలంటే మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చండి. అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది.
కొవ్వు తగ్గుతుంది..
శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీ ఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీ ఎల్ ) ఉంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే వెల్లుల్లి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొదించకపోవచ్చు. కానీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రం తగ్గిస్తుంది. ఇది హృదయనాళ ఆరోగ్యానికి చాలా మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లు..
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీ ఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. అంటే క్యాన్సర్, డయాబెటిస్, అల్జీమర్స్, గుండె జబ్బుల నుంచి రక్షణ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరి.
ఎముకల బలం..
మానవులపై ఇప్పటికీ ఈ అధ్యయనం చేయలేదు. ఎలుకల పై అధ్యయనం చేసి ఇది చెప్పారు. ఆడవారిలో ఈస్ట్రోజెన్ ను పెంచడం ద్వారా ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి. తద్వారా ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.
చర్మ సంరక్షణ..
వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను కలిగించే మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే మీ చర్మానికి పచ్చి వెల్లుల్లిని పూయకండి. చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించిన తర్వాతనే దీన్ని చేయగలరు. అయితే ముఖానికి రాయకుండా తినడం మంచిది.
నొప్పులకు..
వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నయి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను నూనెలో కొన్ని రోజులు నానబెట్టాలి. ఈ నూనెను వాపు ఉన్న కీళ్లపై, కండరాల నొప్పికి పూయండి. ఇది చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.